ఎక్కడి వారుక్కడే……..

◾ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

◾ప్రయాణాలవల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలెక్కువ

◾మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకూ ముప్పు ఉంటుంది

◾మన రాష్ట్రానికి వస్తున్న వలస కూలీలు లక్షదాకా ఉండవచ్చు

◾వారందర్నీ క్వారంటైన్‌లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం

◾వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది

◾అందువల్ల మిగిలిన వారు సహకరించాలి

 

అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను మాత్రమే వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిందని.. ఈ విషయాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అర్ధంచేసుకుని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియలో రాష్ట్రానికి దాదాపు లక్షమంది వచ్చే అవకాశముందని.. వారందరినీ క్వారంటైన్‌ చేసేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో లక్ష పడకల ఏర్పాటుకు తక్షణం మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు. టెలీమెడిసిన్‌ విధానాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలను తెరవాలని, అయితే.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం ధరలను 25 శాతం పెంచాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.కోవిడ్-19 నివారణ చర్యలు, వలస కూలీలు వారివారి రాష్ట్రాలకు తరలింపు.. ఇతర రాష్ట్రాల్లోని మన వలస కూలీలను తీసుకురావడం.. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి లాక్‌డౌన్‌ సడలింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అధికారులు ప్రస్తావించిన అంశాలు.. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి..

ప్రజల సహకారం కొనసాగాలి
► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మన వారు పెద్దఎత్తున ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా వేలల్లో విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు. కానీ, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలనే అనుమతిస్తూ ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మనవారికి ఇది కష్టం అనిపించినా.. విపత్తు తీవ్రత, ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడవాలని నిర్ణయించారు.
► ప్రస్తుతం ఇలా బయల్దేరుతున్న వలస కూలీలు భారీగా ఉంటున్నందున వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం. వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది.
► అందువల్ల మిగిలిన వారు సహకరించాలి. ఎక్కడి వారు అక్కడే ఉండడం క్షేమకరం. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు.
► ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం ఇంకా కొనసాగాలి. కరోనాపై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం.
► ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

యుద్ధప్రాతిపదికన క్వారంటైన్‌ సదుపాయాలు
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన క్వారంటైన్‌ సదుపాయాలను కల్పించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే..
► భోజనం, టాయిలెట్స్, బెడ్స్, బెడ్‌షీట్లు తదితరాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.
► ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను వీలైనంత త్వరగా తయారుచేసి అవసరమైన నిధులను విడుదల చేయాలి.
► కేంద్రం సూచించినట్లుగా వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా వారివారి రాష్ట్రాలకు పంపాలి. అదే.. అంతర్‌ జిల్లాల్లో కూలీలను పంపేటప్పుడు బస్సుల ద్వారా పంపాలి.
► ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు వివరించగా.. వలస కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లతో కూడిన ఒక కిట్‌ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.

పటిష్టంగా టెలీమెడిసిన్‌
సమావేశంలో టెలీమెడిసిన్‌ అమలు తీరుతెన్నులపై ప్రస్తావనకు రాగా.. ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మిస్డ్‌కాల్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడుసార్లు చొప్పున చేయాలని.. అప్పుడే ఆ కాలర్‌ అందుబాటులో లేడని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని.. ఈలోగా టెలీమెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చిన వారికి మందులు డోర్‌ డెలివరీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ద్విచక్రవాహనాలను ఏర్పాటుచేసుకోవాలని, అలాగే థర్మల్‌ బాక్స్‌ కూడా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఉపకేంద్రాలు ప్రారంభమైన తర్వాత మందులు సహా ప్రాథమిక చికిత్స కూడా అక్కడే అందుబాటులో ఉంటుందన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )