
లాక్‌డౌన్ వేళ ట్రాక్టర్లతో హల్‌చల్ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి
చిత్తూరు: లాక్‌డౌన్ వేళ ట్రాక్టర్లతో హల్‌చల్ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.. ఈ సారి అడవి బాట పట్టారు. అడవుల్లో నివసిస్తోన్న గిరిజనుల కోసం ఆయన ట్రాక్టర్, ఎండ్లబండి మీద ప్రయాణంచారు. దట్టమైన అడవుల మధ్య గుడారాలు వేసుకుని నివసిస్తోన్న గిరిజనులకు ఆయన ఆహారా పాకెట్లు, నిత్యావసర సరుకులను అందజేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పాడే మండలంలో గల కుక్కలగుంట, సదాశివపురం, సదాశివ కోన, కందేడు, శివగిరి కాలనీ వంటి గ్రామాలు దట్టమైన శేషాచలం అడవుల మధ్య ఉంటాయి. సుమారు 220 నుంచి 150 కుటుంబాలు ఆయా గ్రామాల్లో నివసిస్తున్నాయి. విస్తరాకులు కుట్టడం, వెదురుతో తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడం, జాతర్ల సమయాల్లో ఆటవస్తువులను విక్రయించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు వారంతా. మరికొందరు కూలీపనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటుంటారు. శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం వల్ల ఆలయం వద్ద చిన్న చిన్న దుకాణాలను నడుపుకొంటూ ఉంటారు.ఈత ఆకులను సేకరించడానికి వారంతా మూకుమ్మడిగా అడవుల్లోకి వెళ్తుంటారు. రెండు, మూడు వారాల పాటు వాటిని సేకరించిన తరువాత వాటిని బయటి వ్యక్తులకు విక్రయిస్తుంటారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆయా గ్రామాల ప్రజలంతా సదాశివ కోన అడవుల్లోకి వెళ్లారు. ఇక అక్కడే ఉండిపోయారు. అడవుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నించగా.. గ్రామస్తులు రావొద్దని సూచించినట్లు సమాచారం. దీనితో వారంతా గుడారాలు వేసుకుని సదాశివ కోన అడవుల్లో నివసిస్తున్నారు. వెంట తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారం, నిత్యావసర సరుకులు అయిపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల వారంతా ఉపాధిని కోల్పోయారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి. లాక్‌డౌన్ ప్రభావం వల్ల కూలీ పనులు సైతం దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అడవి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఏర్పేడు మండలం పరిధిలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు.
గరిజనులు గుడారాలు వేసుకుని జీవిస్తోన్న ప్రాంతాలకు వెళ్లారు. బియ్యపు బస్తాలు, నిత్యావసర సరుకులను తీసుకుని ఏర్పేడు మండల కేంద్రం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం పాటు ఆయన ట్రాక్టర్, ఎడ్లబండిలో పర్యటించారు. అడవుల్లో చిక్కుకుపోయిన వారికి ఆహారాన్ని అందించారు. అరటిపండ్లు, కోడిగుడ్లను అందజేశారు. ఇంకొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని, ఎలాంటి అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని సూచించారు.